ఉన్నత చదువులకోసం అమెరికా వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు వేర్వేరు ప్రమాదాల్లో దుర్మరణం పాలయ్యారు. వీకెండ్ కావడంతో ఆదివారం స్నేహితులతో కలిసి విహారానికి వెళ్లిన యువకులు చనిపోయారు. దీంతో రెండు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.


హైదరాబాద్ వనస్థలిపురంలోని కమలానగర్‌కు చెందిన శ్రీదత్త నంబూది(25) నాలుగేళ్ల క్రితం ఉన్నత చదువుల నిమిత్తం అమెరికా వెళ్లాడు. చదువు పూర్తయిన తర్వాత హర్జాన్‌ సిటీలోని ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఆదివారం తన స్నేహితులతో కలసి మోహయ సమీపంలో వాటర్‌పాల్స్‌ చూడటానికి వెళ్లాడు. అక్కడ శ్రీదత్త ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయినట్లు సోమవారం ఉదయం కుటుంబసభ్యులకు అమెరికా అధికారులు సమాచారం అందించారు. శ్రీదత్త తండ్రి ఎన్‌వీఎమ్‌ స్వామి ప్రైవేటు ఉద్యోగి కాగా.. తల్లి అటవీశాఖలో పనిచేస్తున్నారు. వీరి స్వస్థలం అనంతపురం జిల్లా తాడిపత్రి. శ్రీదత్త మృతదేహం మూడు నాలుగు రోజుల్లో హైదరాబాదుకు చేరుకోనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

మరోయువకుడు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పరిధిలోని బండిపాలెం గ్రామానికి చెందిన పుట్టా నరేష్‌. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఎంఎస్‌ చదువుతున్నారు. ఆదివారం సమీపంలోని లివర్‌మోర్‌ నదిలో బోటు షికారుకు వెళ్లి గల్లంతయ్యాడు. స్థానిక అధికారులు గాలింపుచర్యలు చేపట్టగా భారత కాలమానం ప్రకారం.. సోమవారం రాత్రి నరేష్‌ మృతదేహం లభ్యమైనట్లు మృతుడి బంధువులు తెలిపారు. నరేష్‌ గల్లంతైన విషయం తెలియగానే కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. క్షేమంగా తిరిగొస్తాడని గంపెడాశతో ఎదురుచూసిన వారికి చివరికి నిరాశే ఎదురైంది. మృతదేహాన్ని అమెరికా నుంచి తీసుకొచ్చేందుకు స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్‌ తాతయ్య, విజయవాడ ఎంపీ కేశినేని నాని అధికారులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. నరేష్‌ మృతదేహం మూడు రోజుల్లో స్వదేశానికి చేరుకోవచ్చని వారు తెలిపారు

No comments:

Post a Comment