పెళ్లయి నాలుగు వారాలు కాలేదు. ఇంకా ఇంటి ముందు వేసిన పందిళ్లు కూడా తీయలేదు. ఆమె కాళ్ల పారాణి ఆరలేదు. ఇంతలోనే ఊహించని విషాదం...మృత్యువు వాహన రూపంలో నవ వరుడ్ని కబలించింది. నిండా ఇరవయ్యేళ్లు కూడా లేని యువతికి గుండెకోతను మిగిల్చింది. నక్కపల్లి వద్ద గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదం రెండు గ్రామాల్లో విషాదాన్ని నింపింది. వివరాలిలా వున్నాయి. ఎస్‌.రాయవరం మండలం గుర్రాజుపేటకు చెందిన చొప్పా మంగరాజుకు, నక్కపల్లి మండలం జానకయ్యపేటకు చెందిన వరలక్ష్మితో ఆగస్టు 25న కృష్ణాష్టమి రోజున వివాహం జరిగింది. కాగా వరలక్ష్మి నక్కపల్లిలో ఇంటర్మీడియట్‌ చదువుతోంది.

గురువారం ఆమె కళాశాలకు వెళ్లింది. మంగరాజు (30) తన సోదరుడైన గోవింద్‌ (33)తో కలిసి ద్విచక్ర వాహనంపై తుని బయలుదేరాడు. నక్కపల్లి దాటిన తరువాత కూడలిలో వీరి వాహనాన్ని వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్యాంకర్‌ ఢీకొంది. దీంతో బైక్‌ నడుపుతున్న మంగరాజు అక్కడికక్కడే చనిపోగా, అతని సోదరుడు గోవింద్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అతని కాలు, చేయి విరిగిపోవడంతో నక్కపల్లి ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం హెటెరో అంబులెన్స్‌లో విశాఖపట్నం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మంగరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నక్కపల్లి ఆస్పత్రి మార్చురీకి తరలించారు.

తన భర్త ప్రమాదానికి గురయ్యాడన్న సమాచారం తెలియడంతో వరలక్ష్మి భోరున విలపిస్తూ నక్కపల్లి ఆస్పత్రికి చేరుకుంది. అతను ఎక్కడా కనిపించకపోవడంతో చుట్టూ చూసింది. మార్చురీ వద్ద కుటుంబసభ్యులంతా గుమిగూడి ఉండడంతో ఒక్క సారిగా కుప్పకూలిపోయింది. ఎంతమంది యత్నించినా ఆమెను ఓదార్చలేకపోయారు. ఏం పాపం చేశానంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తుంటే అక్కడున్న వారు కూడా కంటతడి పెట్టారు. మంగరాజు, గోవింద్‌...ఇద్దరూ హెటెరో కర్మాగారంలో పనిచేస్తున్నారు. మంగరాజు తమతో ఎంతో స్నేహంగా వుండేవాడని సహ ఉద్యోగులు ఆవేదన వెలిబుచ్చారు. ఈ సంఘటన జానకయ్యపేట, గుర్రాజుపేట గ్రామాల్లో విషాదాన్ని నింపింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ ఎల్‌.రామకృష్ణ చెప్పారు.

No comments:

Post a Comment