టాలీవుడ్‌లో ఈ సంవత్సరానికి టాప్‌లో నిలిచే గాసిప్ న్యూస్ ఏదైనా ఉందంటే అది చైతూ, సమంత పెళ్లి వ్యవహారమేనని చెప్పక తప్పదు. ఈ జంట చెట్టాపట్టాలేసుకుని తిరగడంపై రోజుకో పుకారు షికారు చేసింది. సోషల్ మీడియాలో వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు హల్‌చల్ చేశాయి. అయితే ఎట్టకేలకు నిమ్మగడ్డ కుమార్తె వివాహ వేడుకలో ఈ పుకార్లన్నింటికీ పుల్‌స్టాప్ పడింది. ఈ వివాహ వేడుకకు అక్కినేని కుటుంబమంతా హాజరయింది. ఈ ఫ్యామిలీలో సభ్యురాలిగా చైతూతో కలిసి సమంత సందడి చేసింది. దీంతో ఇన్నాళ్లు టాలీవుడ్‌లో వీరి పెళ్లిపై రేగిన వదంతులన్నీ గాల్లో కలిసిపోయాయి. ఇటీవలే నాగార్జున ఓ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ తొందర్లోనే తన కొడుకు పెళ్లి జరగబోతోందని చెప్పాడు.
మంచి సమయం కోసం వేచిచూస్తున్నామని క్లారిటీ ఇచ్చాడు. చైతూకు కాబోయే భార్య సమంతేనా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు మీరే చెప్పారుగా అంటూ సమాధానమిచ్చి నాగార్జున తన కోడలు సమంతేనని చెప్పకనే చెప్పేశాడు. ఇన్నాళ్లు తన పెళ్లి వ్యవహారంపై దాటేస్తూ వచ్చిన నాగచైతన్య కూడా నిన్న చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ సమంతతోనే తన పెళ్లి అని స్పష్టం చేశాడు. తన పెళ్లి వచ్చే సంవత్సరం జరుగుతుందని చైతూ చెప్పాడు. ముహుర్తాలు కుదరగానే తన తండ్రి పెళ్లి తేదీని ప్రకటిస్తారని తెలిపాడు. ఇంతకు మించి తననేమీ అడగొద్దని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో నాగచైతన్య బిజీగా ఉన్నాడు. సాహసమే శ్వాసగా సాగిపో, ప్రేమమ్ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇక చైతూ పెళ్లి తర్వాత అఖిల్ కూడా తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిసింది.

No comments:

Post a Comment