సినిమా పరిశ్రమలోని కొందరికి 'గుండమ్మ కథ' సినిమా ప్రీమియర్ షో వేసినపుడు తెర మీద పొడుగాటి నిక్కర్లో ఎన్టీఆర్ పాత్ర ప్రవేశించగానే అక్కడున్న చిన్న పిల్లలందరూ చప్పట్లు కొట్టారట - అంతే ఆ సినిమా దర్శకుడు కామేశ్వర్రావు గారు వెంటనే - "రామారావ్ ... నీ పాత్ర, మన సినిమా రెండూ సూపర్ హిట్" అని జోస్యం చెప్పేశారట. అదీ - సినిమా హీరోలు చిన్న పిల్లలను ఎంతగా ఆకర్షించగలరో అంత పెద్ద స్టార్లు అవుతారు. భారతదేశ సినిమా చరిత్రలో హిమాచలం అంత ఎత్తుకి ఎదిగిన ఏ నటుడిని ఉదాహరణగా తీసుకున్నా సరే, వాళ్లకు చిన్నపిల్లల్లో ఉండే ఆదరణ అంతా ఇంతా కాదు - అది 1987, చిరంజీవి అప్పటికే 'అడవిదొంగ', 'ఖైదీ' సినిమాల్లో సూపర్ ఫాస్ట్ యాక్షన్ సీక్వేన్సులు చేసి తెలుగు సినిమా ప్రేక్షకుల్లో, ముఖ్యంగా చిన్న పిల్లల్లో అతనొక హీమాన్, ఆయనే సూపర్ మాన్, అతనొక ఐకాన్ - తెలుగు సినిమా ఫైట్లకి దిశానిర్దేశం చేశాడు - అలాంటి చిరంజీవి ఒక చైల్డ్ సెంటిమెంట్ అనే కథాంశంతో సినిమా చేస్తే ... ఎందరి గుండెల్లోనో ఒక 'పసివాడి ప్రాణం'గా నిలిచిపోయింది.

ఒక హత్య - దానికి ఎనిమిదేళ్ళ పిల్లవాడు ప్రత్యక్ష సాక్షి, హంతకులకు శిక్ష పడే వరకు ఆ పిల్లవాడిని కాపాడే ఒక పోలీసాఫీసర్ - 1985లో వచ్చిన ఆంగ్ల చిత్రం 'విట్నెస్'. విజయవంతమైన ఈ సినిమా స్ఫూర్తితో మలయాళ దర్శకుడు ఫాజిల్ కొన్ని మార్పులు చేర్పులు చేసి మమ్ముట్టి కథానాయకుడిగా మలయాళంలో "పూవిల్ పుతియ పూన్తేన్నల్" అని ఒక సినిమా చేశారు. ఈ సినిమా పాటలు లేకుండా ఒక ఆర్ట్ ఫిలింలా ఉంటుంది, మరి కొన్ని మార్పులు చేసి అదే దర్శకుడు తమిళంలో సత్యరాజ్ కథానాయకుడుగా "పూవిళిల్ వానవిలే" చేశారు - రెండు బాషల్లో విజయవంతమైన ఈ సినిమాను తెలుగులోకి రీమేక్ చేయటానికి అల్లు అరవింద్ హక్కులు సంపాదించారు - చిరంజీవి హీరో - అప్పటికి ఆయనకు ఉన్న ఇమేజ్ దెబ్బ తినకూడదు, ఎక్కడా హీరోయిజం తగ్గకూడదు, కథలో ఉన్న ఫీల్ పోకూడదు, ఏ కమర్షియల్ ఎలిమెంట్ లేదని ప్రేక్షకులు ఫీల్ అవ్వకూడదు - ఆ బాధ్యతను జంధ్యాలకు, ఒకే కథను మూడో భారతీయ భాషలో సినిమా తీసి ప్రేక్షకులను ఒప్పించాల్సిన దర్శకత్వ బాధ్యతను కోదండరామిరెడ్డికి అప్పగించారు.

ఇక కథలోకి వెళ్తే - ప్రేమలో విఫలమై తాగుడుకి బానిసయిన ఒక యువకుడు మధు, మధుకి ఒకరోజు రాత్రి రోడ్డు మీద దొరికే ఒక ఐదారేళ్ళ మూగ, చెవిటి పిల్లవాడు. తనకంటూ ఎవరూ లేకపోవటంతో ఆ పిల్లవాడిని తనతో తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటాడు మధు. తనకి రాజా అని పేరు పెట్టి అతని మూగ చెవిటి గురించి తెలుసుకున్న మధు అన్నీ తానై తన ఆలనా పాలనా చూసుకుంటూ ఉంటాడు. ఒకానొక సందర్భంలో మధు తల్లిదండ్రుల్ని హత్య చేశారని, ఆ హంతకులను ప్రత్యక్షంగా చూసిన రాజాను కూడా హతమార్చటానికి ప్రయత్నిస్తున్నారని తెలుసుకుంటాడు మధు. ఇంతకీ అసలు రాజా ఎవరు ? తన తల్లితండ్రుల్ని ఎవరు చంపారు ? ఎందుకు చంపారు ? వారి నుంచి రాజాను మధు ఎలా కాపాడాడు ? ఆ హంతకులకు ఎలా శిక్ష పడేలా చేశాడు అనేదే ఈ కథ. ఒకానొక సందర్భంలో రాజా చేసే అల్లరి వల్ల పరిచయం అయ్యే కథానాయకి విజయశాంతి, రాజాకి స్నేహితురాలిగా దగ్గరవుతూ మధుని ప్రేమించటం, తమ పెద్దలకి ఇష్టం లేని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తన అక్క కొడుకే రాజా అని తెలుసుకోవటం, మధు తాగుబోతుగా మారటానికి మరో ఫ్లాష్ బ్యాక్, అందులో మరో హీరోయిన్ సుమలతతో ప్రేమకథ, ఆమెతో ఒక పాట ... ఈ సినిమాకు మాతృక ఆంగ్ల చిత్రం అయినప్పటికీ - అప్పటికే మలయాళ, తమిళ భాషల్లో వచ్చిన ఈ సినిమాలో మన నేటివిటికి తగ్గ మార్పులు ఉంటాయి - కానీ తెలుగులోకి వచ్చే సరికి, అదీ చిరంజీవితో సినిమా అనే సరికి చేయాల్సిన మార్పులన్నిటినీ ఎంతో చాకచక్యంగా, జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది - వాటన్నిటినీ కూర్చి ఎంతో అద్బుతంగా తయారు చేసి వెండితెర మీద ఆవిష్కరించిన అద్బుతమైన సినిమా 'పసివాడి ప్రాణం'.

ఈ సినిమాలో ఒక తాగుబోతుగా, ఒక ప్రేమికుడిగా, ఒక బాధ్యత గల పౌరుడిగా చిరంజీవి ప్రదర్శించిన నటన గురించి చెప్పటం అంత సులువు కాదు - ప్రీ టైటిల్ ఎపిసోడ్ - టైటిల్స్ - వెంటనే 'సత్యం శివం సుందరం' అనే పాట, అక్కడ నుంచి బార్లో వేరే తాగుబోతులతో ఒక ఫైటు - అదీ చిరంజీవి ఇంట్రో - మందు కొట్టి నటించే సన్నివేశాల్లో చిరంజీవికి తిరుగులేదు - ఒక రకమైన అమాయకత్వాన్ని, హాస్యాన్ని కలిపి చిరంజీవి నటించినంత అద్బుతంగా మరెవరూ చేయలేరనేది నిస్సందేహం. అది అప్పటి నుంచి 'అందరివాడు' వరకు మనకు తెలిసిందే. మొదటి ఫైట్ తర్వాత బార్ బయట "నేనెంత తాగినా రాక్ రాక్ రాక్ స్టడీగా రాకుమారుడిలా ఇంటికెళ్లగలను తెలుసా?" అని మొదలయ్యే చిరంజీవి తాగుబోతు నట విన్యాసం, ఫుట్ పాత్ మీద పడుకుని ఉన్న పిల్లవాడిని చూసి అధికారిక తెలుగు బాషలో, విచిత్రమైన హిందీలో, తెలుగు కలిపిన ఆంగ్లంలో వేలం పాడినట్టు కార్ మీద నిలబడి ఉపన్యాసం ఇచ్చి, ఇంటికి తీసుకొచ్చి నిద్రపోతున్న పసి పిల్లవాడితో తన భగ్నప్రేమ గురించి చెప్పటం, ఆ పిల్ల వాడికి రాజా అని పేరు పెట్టటం వరకు ఎంత హాస్యం ఉంటుందో అంతే ఫీల్ ఉంటుంది. ఆ హ్యాంగ్ ఓవర్ నుంచి ప్రేక్షకులు బయటకు రాక ముందే హ్యాంగ్ ఓవర్లో ఉన్న చిరంజీవి గడ్డం గీసుకుంటూ తన తాగుబోతు భాషలో పిల్లవాడికి పెట్టిన పేరు జానీ వాకరా, షీవాస్ రీగలా అని గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయటంలో అతని నటన చాలా సహజంగా ఉంటుంది. రాజా మూగ, చెవిటి వాడు అని అనుమానం రాగానే అది ద్రువీకరించుకోటానికి ఇంట్లోని ఒకొక్క వస్తువును పగలకొట్టేటప్పుడు ఆ శబ్దాలకు ఏ మాత్రం చలనం లేని రాజాను చూస్తూ రాజా వైపు అడుగులు వేసేటపుడు చిరంజీవి నటన అద్బుతంగా ఉంటుంది - ఆ సన్నివేశంలో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ (సినిమా చివరి వరకు చాలా సార్లు వచ్చే అదే మ్యూజిక్) సినిమాలోని ఫీల్ ని మరో మెట్టు పైకి తీసుకెళ్ళింది.

ప్రత్యేకించి కమెడియన్లు, సినిమాలోని కథకు సంబంధం లేని కామెడీ ట్రాకులు లేని రోజులు అవి. ఆ బాధ్యత కూడా చిరంజీవి తన టైమింగుతో చక్కగా నిర్వర్తించారు. తాజ్ మహల్ గురించి తల తినేసే విజయశాంతి కనపడగానే తప్పించుకోటానికి చేసే ప్రయత్నాలు, రాజాను తమ పిల్ల వాడని చెప్పి తీసుకేల్లిపోటానికి ప్రయత్నించే అల్లు రామలింగయ్యకు బుద్ది చెప్పే సన్నివేశాల్లో తన నటనకు తెలుగు సినిమా సలాం కొట్టింది. మరీ ముఖ్యంగా "బాబాయ్ ... దా... దా... మీ వీర వెంకట సత్యన్నారాయణ రమణ దుర్గా గోవింద వర ప్రసాదు" అంటూ మన 'కొణిదల శివ శంకర వర ప్రసాదు' చెప్పే డైలాగులో స్టైల్ అతనికి మాత్రమే సొంతం. ఇక రాజాను చంపేయటానికి ఎవరో ప్రయత్నిస్తున్నారన్న విషయం తెలుసుకున్న తర్వాత వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ లో ఫైట్లకే కొత్త భాష్యం చెప్పిన చిరంజీవి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే - ఆ ఎపిసోడ్ మొత్తంలో చిరంజీవి ఎక్కడ కనిపించినా ఆ పసిపిల్ల వాడి పట్ల ఒక బాధ్యత తన మొహంలో కనిపిస్తూనే ఉంటుంది. అలాగే పసిపిల్ల వాడికి ఏ క్షణంలో ఏమైనా జరగచ్చు అని తెలుసుకున్న మధు తన తాగుడు మానుకోటానికి సిద్దపడే సన్నివేశం సినిమాకే హైలైట్.

ఇక డ్యాన్సులు - "చక్కని చుక్కల సందిట బ్రేక్ డ్యాన్స్" అంటూ చిరంజీవి వేసిన స్టెప్పులు 'నభూతో నభవిష్యతి'. చిరంజీవి తన ఫైట్లతో తెలుగు ప్రేక్షకులకు ఒక కొత్తదనాన్ని అప్పటికే రుచి చూపించారు, ఈ సినిమాతో తెలుగు సినిమాలో తొలి సారిగా బ్రేక్ డ్యాన్స్ చేసి డాన్సుల్లో కొత్తదనాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఒక్క పాట మినహా అన్ని పాటలు కాశ్మీర్ లో తీశారు. చక్రవర్తి అందించిన సంగీతం ఈ సినిమాకు అదనపు బలం అయితే, తారా కంపోజ్ చేసిన నృత్యాలు మరో హైలైట్. ఈ సినిమాలో ఉన్న నటీనటులందరూ తమ పాత్ర పరిధిలో బాగా చేశారు - ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మాత్రం మూగ వాడి పాత్రలో అద్బుతంగా నటించిన బేబీ సుజిత గురించి - తన తల్లిని చంపేశారని చెప్పటానికి, చంపినా వారి ఆనవాలు చెప్పటానికి "యా యా " అంటూ ఆ పాప చేసే ప్రయత్నం చాలా హృద్యంగా అభినయించింది. తెలుగు కన్నా ముందు వచ్చిన మలయాళం, తమిళంలలో కూడా ఆ పాత్ర సుజితానే పోషించింది. తర్వాత కన్నడలో 'ఆపద్బాంధవ' గా, హిందీలో 'హత్య' గా రీమేక్ అయిన ఈ సినిమాలో ఆ భాషలో కూడా సుజితానే ఆ పాత్ర పోషించింది. ఒకే పాత్రను ఐదు భాషల్లో పోషించి సుజిత గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా చోటు సంపాదించింది. ఇదే బేబీ సుజిత, 'జై చిరంజీవ' చిత్రంలో చిరంజీవి చెల్లెలిగా నటించింది.

షాట్ కట్ చేస్తే - చిరంజీవి కెరీర్లో అప్పటికి రెండో అతి పెద్ద హిట్ సినిమా 'పసివాడి ప్రాణం' - నాలుగు ఆటలతో పది కేంద్రాల్లో 100 రోజులు ఆడింది, అందులో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సుదర్శన్ 35 ఎంఎం ఒకటి, ఐదు ఆటలతో మూడు కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఐదు ఆటలతో తిరుపతి మినీ ప్రతాప్ ధియేటర్లో 175 రోజుల పాటు ఆడింది - అది తెలుగు సినిమాలో ఇప్పటికీ తిరుగులేని ఆల్ టైం రికార్డ్ - ఈ సినిమా 175 రోజుల వేడుక కూడా లక్షలాది మంది అభిమానుల మధ్య తిరుపతిలోనే జరిగింది. అప్పట్లో నాలుగు కోట్లు వసూలు చేసిన చిరంజీవి 'ఖైదీ' సినిమా చరిత్రను తిరగరాస్తూ చిరంజీవి పసివాడి ప్రాణం సినిమా నాలుగున్నర కోట్ల రూపాయలు వసూలు చేసింది. అప్పటికే చిరంజీవి నెంబర్ 1 హీరోగా అనధికారంగా పిలవబడుతున్నా, 'పసివాడి ప్రాణం' చిత్రంతో మీడియా చిరంజీవిని అధికారికంగా నెంబర్ 1 హీరో అని ప్రస్తావించటం మొదలు పెట్టింది. తొలిసారిగా రష్యన్ భాషలోకి అనువదించబడి మాస్కోలో 600 థియేటర్లలో విడుదలైన మొట్టమొదటి దక్షిణ భారత దేశ సినిమా - 'పసివాడి ప్రాణం' - అంతేనా ... ఇదే కథను 28 సంవత్సారాల తర్వాత 2015లో సమకాలీన పరిస్థితులకు తగ్గట్టుగా మరిన్ని మార్పులు చేర్పులు చేసి రచయిత విజయేంద్ర ప్రసాద్ మరో కథ రాస్తే - అది సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా 'భజరంగి భాయిజాన్' అయింది, అది మూడు వందల కోట్లు వసూలు చేసిన సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ గారు అన్నమాట - "మన పసివాడి ప్రాణం" సినిమా ఫార్ములా ఖరీదు 300 కోట్లు" అని.

ఒక్క మాటలో .... రికార్డులు 'బ్రేక్' చేసిన 'పసివాడి ప్రాణం'

చిన్ననాటి జ్ఞాపకం : నాకు చిరంజీవి పిచ్చి పట్టించిన ఆద్యుడు మా మేనత్త కొడుకు దయానంద్, చిరంజీవికి వీరాభిమాని - అతను ఈ సినిమాను థియేటర్లో దాదాపు 35 సార్లు చూసుంటాడు. ఇప్పుడంటే సీడీలు కానీ, అప్పట్లో ఆడియో క్యాసెట్లు వచ్చేవి - 'ఏ' సైడ్, 'బీ' సైడ్ అని రెండు వైపులు ఉండేవి. ఖాళీ క్యాసెట్లల్లో మనకు కావాల్సిన పాటలు మాత్రం రికార్డు చేసివ్వటం ఆడియో షాపుల్లో మరో వ్యాపారం. ఒక ఖాళీ క్యాసెట్లో 12, కొంచెం ఎక్కువ ధర ఉన్న క్యాసెట్ అయితే 18 పాటలు దాకా రికార్డు చేయించుకోవచ్చు. అలా ఒక క్యాసెట్ మొత్తం "చక్కని చుక్కల సందిట బ్రేక్ డ్యాన్స్" పాటను రికార్డు చేయించాడు మా బావ. ఆ క్యాసెట్ ఎప్పుడు ఎటు వైపు పెట్టినా అదే పాట వచ్చేలా అనమాట. ఆ క్యాసెట్ ఏ సైడ్ ప్లే చేసినా మా ఇంటి చుట్టు పక్కల ఉన్న అన్ని సైడ్స్ అదిరిపోయేవి - ఇంట్లో బ్రేక్ డ్యాన్సులతో పండగ జరిగేది.

No comments:

Post a Comment