టాలీవుడ్‌లో ఒకే కుటుంబం నుంచి ఎక్కువ హీరోలు ఉన్న కుటుంబాల్లో మెగాస్టార్ కుటుంబం ఒకటి. ఈ కుటుంబం నుంచి దాదాపు ఏడెనిమిది మంది హీరోలు, ఒక హీరోయిన్ సినీ తెరపై రాజ్యమేలుతున్నారు. ఈ హీరోలందరూ కలిసికట్టుగా ఉన్నట్లే ఈ హీరోల అభిమానులు కూడా ‘మెగా’ అభిమానులుగా కలిసికట్టుగా ఉంటున్నారు. ఇటీవలి కాలంలో ఈ హీరోల మధ్య జరుగుతున్న అంతర్గత పోరు గురించి, సెటైర్ల వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే. బన్నీ నటించిన ‘సరైనోడు’ ఫంక్షన్‌లో అభిమానులు ‘పవర్‌స్టార్’ అంటూ కేకలు వేయడం, దీనిపై బన్నీ కొంత ‘విసుగు’ వ్యక్తం చేయడం ఇటీవల ఈ కుటుంబానికే చెందిన మరో హీరో సాయిధరమ్ తేజ్ ‘మామయ్య పేరు పిలవడానికి అంత ఇబ్బంది ఏమిటో’ అంటూ వ్యాఖ్యానించడం ఈ వివాదాలకు అద్దం పడుతున్నాయి. ఈ వివాదాల నేపథ్యంలో మెగా అభిమానులను విడదీయడానికి కొందరు కుట్ర పన్నుతున్నారని, ఎన్నో ఏళ్లుగా కలిసికట్టుగా ఉన్న హీరోలు అలాగే ఉండాలని, అంతర్గత పోరు నడిపి అభిమానులు విడిపోయేలా వ్యవహరించకూడదని ఒక మెగా వీరాభిమాని మెగా హీరోలకు మెత్తగా వార్నింగ్ ఇచ్చాడు. దీనికి సంబంధిని ఈ వీరాభిమాని ఫేస్‌బుక్‌లో ఒక కరపత్రాన్ని విడుదల చేసినట్లు, ఆ కరపత్రం సోషల్ మీడియాలో హల్‌చల్ సృష్టిస్తున్నట్లు ఫిలింనగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎన్నో ఏళ్లుగా కలిసికట్టుగా ఉన్న భారతీయులను వ్యాపారం కోసం వచ్చిన కొందరు ఎలా విభజించి పాలించారో.. అదేవిధంగా మెగా హీరోలను, మెగా అభిమానులను కూడా విభజించి పాలించాలని కొందరు కుట్ర పన్నుతున్నారని ఆ వీరాభిమాని వ్యాఖ్యానించాడు. 

‘మీరు మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఆ నిమిషం మీలో భావాలను, ఎవరో చెబితే విన్న విషయాలను అభిమానులపై రుద్దకండి’ అంటూ హితవు పలికాడు. అంతేకాదు, ఈ వ్యవహారాన్ని చూస్తూ ఉన్నారే కానీ దీనికి చరమగీతం పాడకుండా మెగా సీనియర్ హీరోలు సైతం వ్యవహరిస్తున్నారని, వాళ్లు తమ పద్ధతి మార్చుకొని ఈ సమస్యకు ఒక పరిష్కారం చెప్పాలని సూచించాడు. ‘కలహించే వాడు కాదు.. కలిసుండే వాడే అభిమాని’ అనే స్లోగన్ ఈ వీరాభిమాని తన కరపత్రాన్ని ముగించాడు. ఎవరిని ఉద్దేశించి పై వ్యాఖ్యలు చేశాడో వేరే చెప్పనక్కర్లేకుండా.. చెప్పకుండానే.. చెప్పాల్సిందతా చెప్పేశాడు కదా ఈ తెలివైన వీరాభిమాని. చూద్దాం.. మరి మెగా హీరోలు ఈ కరపత్రాన్ని ఎంత సీరియస్‌గా తీసుకుంటారో!

No comments:

Post a Comment