క‌ర్ణాట‌క మాజీ మంత్రి గాలి జ‌నార్ద‌న్ రెడ్డి… ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారుల‌నే నిల‌బెట్టేశారు అక్ర‌మ మైనింగ్ బ్యార‌న్‌, ఇప్ప‌టికే పీక‌ల్లోతు కేసుల్లో చిక్కుకుపోయిన గాలి… కూతురు పెళ్లి పేరు చెప్పుకుని సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తీసుకున్నారు. అంతేనా… త‌న సొంతూరు బ‌ళ్లారిలోకి అడుగుపెట్టేందుకు కూడా ఆయ‌న‌కు కోర్టు ఆంక్ష‌ల‌తో కూడిన అనుమ‌తి తీసుకోవాల్సిన పరిస్థితి.

త‌న కంపెనీల‌తో పాటు ఇంటిలోనూ సోదాలు చేసేందుకు వ‌చ్చిన ఐటీ అధికారుల‌ను గాలి జ‌నార్ద‌న్ రెడ్డి త‌న ఇంటి బ‌య‌టే నిల‌బెట్టేశారు. అయినా కేసుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న గాలి జ‌నార్ద‌న్ రెడ్డి అంత సాహ‌సం ఎలా చేయ‌గ‌లిగారంటే… దానికి స‌మాధాన‌మే దొర‌క‌ని ప‌రిస్థితి. కూతురు పెళ్లికి వంద‌ల కోట్ల‌ను ఖ‌ర్చు చేసిన గాలి వైనంపై ఐటీ శాఖ‌కు ఓ ఫిర్యాదు అందింది. దాని ఆధారంగా నిన్న ఐటీ శాఖ‌కు చెందిన 8 మంది అధికారులు బ‌ళ్లారిలో వాలిపోయారు. నేరుగా గాలి జ‌నార్ద‌న్ రెడ్డి కంపెనీల్లో సోదాలు చేశారు.

ఈ స‌మ‌యంలో ఏ ఒక్క‌రిని కూడా ఐటీ అధికారులు లోప‌లికి అనుమ‌తించ‌లేదు. అలాగ‌ని లోప‌ల ఉన్న వారిని బ‌య‌ట‌కు కూడా పంపలేదు. ఈ స‌మ‌యంలో గాలి జ‌నార్ద‌న్ రెడ్డి హైద‌రాబాదులో ఉన్నార‌ట‌. స‌మాచారం తెలుసుకున్న ఆయ‌న హుటాహుటిన బ‌ళ్లారికి బ‌య‌లుదేరిపోయారు. గాలి కంపెనీల్లో ముమ్మ‌ర సోదాలు చేసిన ఐటీ అధికారులు ఆ త‌ర్వాత నేరుగా ఆయ‌న ఇంటికి చేరుకున్నారు. వ‌చ్చిందే త‌డవుగా వారు గాలి ఇంటిలోకి వెళ్లేందుకు య‌త్నించారు. వారిని గేటు వ‌ద్దే గాలి అనుచ‌రులు అడ్డుకున్నారు. లోప‌లికి అనుమ‌తించే ప్ర‌సక్తే లేద‌ని తేల్చిచెప్పారు. తాము ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారుల‌మని చెప్పినా కూడా గాలి అనుచ‌రులు ఏమాత్రం వెన‌క్కు త‌గ్గ‌లేద‌ట‌. య‌జ‌మాని ఇంటిలో లేర‌ని, ఈ స‌మ‌యంలో ఎవ‌రినైనా ఇంటిలోకి అనుమ‌తించేదే లేద‌ని వారు మొండికేశార‌ట‌. దీంతో చేసేదేమీ లేక ఐటీ అధికారులు గాలి ఇంటి గేటు బ‌య‌టే నిల‌బ‌డిపోయిన ప‌రిస్థితి.

గాలి అనుచ‌రుల‌కు ఎలా అర్ధ‌మ‌య్యేలా చెప్పాలా? అని ఆలోచిస్తుండ‌గానే గాలి జ‌నార్ద‌న్ రెడ్డి అక్క‌డికి రానే వ‌చ్చారు. దీంతో ఆయ‌నను తీసుకుని ఐటీ అధికారులు లోప‌లికి వెళ్లిపోయారు. లోపల త‌మ‌కు అనుమానం ఉన్న ప‌లు రికార్డుల‌ను త‌నిఖీ చేసిన ఐటీ అధికారులు… కూతురు పెళ్లికి వంద‌లాది కోట్ల మేర ఎలా ఖ‌ర్చు చేశార‌ని గాలిని ప్ర‌శ్నించార‌ట‌. నోట్ల ర‌ద్దుతో జ‌నం అల్లాడుతుంటే మీకు డ‌బ్బెక్క‌డి నుంచి వ‌చ్చింద‌ని ప్ర‌శ్నల వ‌ర్షం కురిపించార‌ట. అయితే గాలి కూడా త‌న అనుచ‌రుల లాగానే ఐటీ అధికారులకు కాస్తంత ఘాటు స‌మాధానాలే ఇచ్చార‌ట‌. త‌న కూతురు పెళ్లి కోసం చేసిన ఖ‌ర్చంతా త‌న ఆస్తులు కుదువ పెట్టి తెచ్చిన డబ్బేన‌ని ఆయ‌న చెప్పుకొచ్చార‌ట‌. త‌మ‌ను చూసి గాలి ఏమాత్రం బెద‌ర‌క‌పోవ‌డంతో ఐటీ అధికారులు వెన‌క్కు త‌గ్గ‌క త‌ప్ప‌లేద‌ట‌. అయితే పెళ్లి ఖ‌ర్చుల వివ‌రాల‌ను ఈ నెల 25లోగా పూర్తిగా అంద‌జేయాల‌ని నోటీసులు జారీ చేసి వారు అక్క‌డి నుంచి నిష్క్ర‌మించారు.

No comments:

Post a Comment