దాదాపు తెలుగు సినీ అభిమానులంతా మెగాస్టార్ చిరంజీవి ‘చాలెంజ్’ సినిమా చూసే ఉంటారు. ఆ సినిమాలోని ఒక సన్నివేశంలో చేతిలో రూపాయి కూడా లేక, తినడానికి తిండి లేక, ఉండడానికి చోటు లేక చిరంజీవి రోడ్డు పక్కనే ఉన్న ఒక అరుగుపై కూర్చొని ఉండగా ఒక అవ్వ చిరంజీవిని యాచిస్తుంది. ‘ఈడ్చి తన్నినా నా దగ్గర చిల్లిగవ్వ లేదవ్వ’ అని చిరంజీవి ఎన్ని సార్లు చెప్పినా మళ్లీ మళ్లీ అడుగుతుంది. దీంతో విసుగెత్తిన చిరంజీవి ఆమెపై కోప్పడతాడు. అక్కడి నుంచి వెళ్లిపోయిన అవ్వ.. తిరిగి వచ్చి చిరంజీవికి ‘వేరు శనగలు కొనుక్కోమని’ ఐదు పైసలు ఇస్తుంది. దాన్నే ఆయన కొండంత అండగా భావిస్తాడు. సరిగ్గా ఇలాంటి సంఘటనే కాకపోయినా ఇలాంటి పరిస్థితే తన మేనియాతో ప్రపంచాన్ని ఊపేస్తున్న ‘కబాలి’కి ఎదురైంది.


రజనీకాంత్ సూపర్ స్టార్ ఇమేజ్ పొందిన తరువాత బెంగళూరులోని ఒక సుప్రసిద్ధ ఆలయాన్ని సందర్శించారు. ఆ గుడిలో ఆయన ఒక స్తంభం దగ్గర కూర్చున్నాడు. అయితే, రజనీ సూపర్ స్టార్‌లా కాకుండా తను బాగా ఇష్టపడే తన ఒరిజినల్ గెటప్‌లో గుడికి వెళ్లాడు. మామూలు పంచె, చెరిగిన జుత్తు, మాసిన గెడ్డంతో స్తంభం దగ్గర కూర్చుని ఉన్న రజనీని చూసి ఒక గుజరాతీ మహిళ.. ఆయనను బిచ్చగాడు అనుకుంది. ఇంకేముంది, బిచ్చగాడికి దానం చేస్తే పుణ్యం వస్తుందనుకుందో ఏమో.. రజనీకి పది రూపాయలు దానం చేసింది. రజనీ ఏమీ మాట్లాడుకుండా ఆమె ఇచ్చిన పది రూపాయలు తీసుకున్నాడు. అయితే, ఇది గమనించిన కొంతమంది సూపర్ స్టార్‌కి బిచ్చం వేస్తావా అంటూ ఆమెను తిట్టడం మొదలెట్టారు. దీనికి బిత్తరపోయిన ఆ మహిళ.. రజనీకి క్షమాపణ చెప్పిందట. అయితే, రజనీ మాత్రం ఆమెను ఓదార్చుతూ, తాను సూపర్ స్టార్‌ని కాదని, మామూలు మనిషినని, ఈ మాట దేవుడు ఆమెతో చెప్పించాడని, ఆమె ఇచ్చిన పదిరూపాయలకు మరో పది లక్షలు కలిపి ఒక అనాథ శరణాలయానికి విరాళంగా ఇచ్చాడట. ఈ విషయాన్ని ప్రముఖ వైద్యురాలు గాయత్రిశ్రీకాంతఓ రజనీకాంత్‌పై రాసిన పుస్తకంలో వెల్లడించారు.

No comments:

Post a Comment