గోవులపై అతిపెద్ద సంచలన నిర్ణయం తీసుకోబోతున్నది గుజరాత్ రాష్ట్రం. గోపులను చంపినా.. ఆవు మాంసాన్ని రవాణా చేసినా కఠిన శిక్షలు వేయటానికి రెడీ అవుతుంది. గోవులను చంపే వారికి జీవిత ఖైదు శిక్ష విధించేలా చట్టం తీసుకువస్తాం అని చెబుతున్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ. ఈ మేరకు ఈ బడ్జెట్ సమావేశాల్లోనే దీనిపై సరికొత్త చట్టం చేస్తామని ప్రకటించారు. గోవుల సంరక్షణకు కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు విజయ్ రుపానీ. జునాఘడ్ జిల్లా వంతాలీ పట్టణంలోని స్వామినారాయణ్ గురుకుల్ లో జరిగిన సభలో గుజరాత్ సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. 2011వ సంవత్సరంలో గోవుల సంరక్షణకు ప్రవేశపెట్టిన చట్టంపై సుప్రీంకోర్టులో పోరాడతామని వెల్లడించారు రూపానీ. ఆవు మాంసాన్ని రవాణా చేసే వాహనాలను శాశ్వతంగా సీజ్ చేసేలా చట్టం తీసుకువస్తామన్నారాయన. గతంలో గోవును వధించినా, గో మాంసాన్ని తరలించినా 50వేల జరిమానాతోపాటు ఏడేళ్ల జైలు శిక్ష విధించేలా చట్టం చేశామన్నారు. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం 2011 లో తీసుకువచ్చిన గో సంరక్షణ చట్టానికి మార్పులు తీసుకువచ్చి కఠిన శిక్షలు పడేలా చూస్తామన్నారు రూపానీ. గుజరాత్ రాష్ట్రం తీసుకురాబోతున్న ఈ చట్టం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.

No comments:

Post a Comment