విశాఖలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తనూజ డెత్ మిస్టరీ వీడింది. తనూజది హత్యకాదు ఆత్మహత్యే అని పోలీసులు తేల్చారు. అయితే ప్రేరేపించటం వల్లే ఆత్మహత్య చేసుకుందని భావించిన పోలీసులు నిందితుడిని గుట్టుచప్పుడు కాకుండా జైలుకు తరలించారు. ఇదే ఇప్పుడు మరెన్నో అనుమానాలను రేకెత్తిస్తోంది.
జులై 24 విశాఖలోని పెందుర్తి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తనూజ అనే ఓ యువతి ముళ్ల పొదల్లో శవమై తేలిన ఘటనను చూసి కలవరపడింది. తనూజ మృతదేహాన్ని చూసిన వారంతా గ్యాంగ్ రేప్‌ చేసి చంపేసారనే అనుమానాన్ని వ్యక్తం చేసారు. మహిళా సంఘాలు కూడా తనూజ కేసులో నిజనిజాలు వెలికితీయాలని ఆందోళన బాట పట్టాయి.
రెండున్నర నెలల తర్వాత తనూజను గ్యాంగ్‌ రేప్‌ అండ్ మర్డర్‌ కాదు ఆత్మహత్యేనని పోలీసులు తేల్చారు. పోస్ట్‌మార్టమ్‌ రిపోర్ట్‌, ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ ఆధారంగా నిర్ధారణకు వచ్చిన విశాఖ పోలీసులు కేసు క్లోజ్ చేసారు. అంతేకాదు తనూజ ఆత్మహత్య చేసుకోవడానికి దిలీప్‌ అనే నిందితుడు కారణమంటూ అరెస్ట్ చేసారు. గుట్టుచప్పుడు కాకుండా దిలీప్‌ను అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు.
అయితే దిలీప్‌ను మీడియా ముందు ప్రవేశ పెట్టకుండా, కేసు వివరాలు చెప్పకుండా హుటాహుటిన జైలుకు తరలించాల్సిన అవసరం ఏమొచ్చిందని మహిళాసంఘాలు ప్రశ్నిస్తున్నాయి. నిజాలు దాచిపెట్టేందుకు, యధార్ధాలను సమాధి చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తనూజ చనిపోవడానికి కొద్ది రోజుల ముందే అనుమానాస్పద స్ధితిలో చనిపోయిన అనకాపల్లి లావణ్య విషయంలోనూ పోలీసులు ఇదే రీతిలో విమర్శలు ఎదుర్కొన్నారు. తప్పతాగిన నిందితులు కొందరు లావణ్యను కిరాతకంగా చంపేసారనే ఆరోపణలు విన్పిస్తుండగానే ఇట్స్‌ జస్ట్‌ యాక్సిడెంట్‌ అంటూ కేసు క్లోజ్‌ చేసారు. తనూజ కేసు కూడా ఇదే రీతిలో జరిగిందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి

No comments:

Post a Comment